Minister Errabelli: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో జరిగే పల్లె ప్రగతి కార్యక్రమానికి వెళ్తున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్యలో తన రూటు మార్చారు. మార్గ మధ్యలో బంధనపల్లి గ్రామంలో ఆగి అక్కడ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలతో కలిసి సరదాగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు ఆరాతీశారు. అనంతరం ఉపాధిహామీ కూలీలతో కలసి పలుగూపారా పట్టి కూలీగా మారారు. మట్టి తీస్తూ ఈ రోజు కూలీ మొత్తం 'నాకే' అంటూ అక్కడ నవ్వులు పూయించారు. మట్టి మోసి తానూ రైతు బిడ్డనే అంటూ వారితో కలిసిపోయారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ డబ్బులు సకాలంలో అందుతున్నాయా.. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరాతీశారు. అనంతరం కొత్తూరులో జరిగే పల్లె ప్రగతి కార్యక్రమానికి బయలుదేరారు.
గ్రామ పంచాయతీల చెక్కులు పెండింగ్‌లో లేవని... ఉపాధి హామీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. అవి కూడా కేంద్రమే ఆపిందని ఎర్రబెల్లి తెలిపారు. నెల, రెండు నెలల క్రితం చేసిన పనులకు రూ. 650 కోట్లు విడుదల చేశామన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేసినందుకే... కేంద్రం వద్ద రూ. 800 కోట్లు ఆగాయని మంత్రి తెలిపారు. సర్పంచ్‌లు ఎవరూ ఆందోళన చెందవద్దని.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు త్వరలోనే వస్తాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు.