ఉద్యోగాలివ్వని భాజపాకు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వొద్దని మంత్రి ఎర్రబెల్లి కోరారు. తెరాస ప్రభుత్వం.. ఇవ్వని హామీలనూ నెరవేర్చిందని గుర్తు చేశారు. విద్యావంతుడైన రాజేశ్వర్ రెడ్డినే ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో.. ఎమ్మెల్యే సుదర్శన్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి సత్యవతి రాఠోడ్‌తో కలిసి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
రాష్ట్రానికి.. మెడికల్ కాలేజీ, పసుపు బోర్డు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు తెప్పించలేని.. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లకు.. తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత లేదంటూ మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కనీస మద్దతు ధర గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తెరాస.. వ్యవసాయాన్ని ఓ పండుగలా జరిపిస్తోంటే, భాజపా.. దండగాల భావిస్తోందంటూ విమర్శించారు.
భాజపా మమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఇంతకు కేంద్రం ఏం చేసింది? ఏడాదికి 3 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి. 100 రోజుల్లో నల్ల ధనాన్ని తెచ్చి.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్నారు. వేశారా? ఇంధన, నిత్యావసరాల ధరలు పెంచిన వారికి ఓటు వేద్దామా? రాష్ట్రంలో అమలవుతోన్న పథకాలు.. దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? నిరూపిస్తే.. నేను దేనికైనా సిద్ధమే.