సాధారణంగా వరినాట్లు అనగానే అందరికీ ఆడవారు గుర్తుకొస్తారు. బురదమళ్లల్లో జానపద గేయాలు పాడుకుంటూ... సరదాగా వరి నాట్లు వేస్తుంటారు. అయితే ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురవడం.. ఇప్పటికే రైతులు వరినాట్లు వేస్తున్నారు. నాట్లు వేయడానికి మహిళా కూలీల కొరత ఉండటం వల్ల ఆ కొరతను అధిగమించడానికి ఇతర రాష్ట్రాల పురుష కూలీలను రప్పించుకుని మరీ నాట్లు వేయిస్తున్నారు. ఇది ఎక్కడో కాదండోయ్... హనుమకొండ జిల్లాలోనే.
జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో వ్యవసాయ కూలీల కొరత అధికంగా ఉండటం వల్ల... ఆదిరెడ్డి అనే రైతు... ఉత్తరప్రదేశ్‌కు చెందిన పురుష కూలీలను రప్పించి.. వారితో నాట్లు వేయిస్తున్నారు. నారు పీకిన దగ్గర నుంచి నాట్లు వేసే వరకు ఈ కూలీలే చూసుకుంటారని తెలిపారు. 3, 4 గంటల్లో 2 ఎకరాలకు పైగా పొలంలో నాట్లు వేస్తున్నారని చెప్పారు. దీనితో రైతులకు సమయం, డబ్బు రెండు ఆదా అవుతుందని హర్షం వ్యక్తం చేశారు.