ఆ మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం!.. నిరంకుశ నిజాం నుంచి స్వాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి సాక్ష్యం! అదే.. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన. సరిగ్గా 73 ఏళ్ల క్రితం.. 1947లో ఇదే రోజున (సెప్టెంబరు 2న) జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే కాంక్షతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో హాజరైన ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఆ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. ఈ ఊచకోత జరిగిన ప్రాంతంలో అమరుల స్మారకార్థం 18 ఏళ్లక్రితం అమరధామాన్ని నిర్మించారు. ఏటా సెప్టెంబరు 2న ఈ అమరధామం వద్ద స్వాతంత్య్ర సమరయోధులు, మేధావులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు నాటి ఘటనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నారు.
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలోని తహసీల్ రోడ్లో ఈ అమరధామం ఉంది. రజాకార్ల చేతిలో హతులైన వారి శిల్పాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక పిడికిలి ఎత్తి, మరో చేతితో కర్ర పట్టి పోరాటానికి పయనిస్తున్నట్లుగా ఈ విగ్రహాలు ఉన్నాయి. గుమ్మటం పైభాగాన వారిని చెట్టుకి కట్టి చంపిన దృశ్యాలు, వారి దేహం నుంచి తూటా తగిలి రక్తం కారడం, కాళ్లు తెగి పడిన దృశ్యాలను చూస్తే ఒళ్లు జలదరిస్తుంది.
ఆ శిల్పాలు, మట్టి మనుషుల బొమ్మలు చూస్తే నరనరాన ఆవేశం పొంగిపొర్లుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన ఉద్యమంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధూంధాంకు, ఆట పాటలకు ఇది వేదికగా నిలిచింది. కొన్ని విప్లవ సినిమాలు, సీరియల్స్ షూటింగులకు నిలయంగా మారింది. పర్యటకులు నిత్యం వందల సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. రంగాపూర్ (మొగుళ్లపల్లి మండలం), కానిపర్తి(రేగొండ)కి చెందినవారు పరకాల ఊచకోతలో అసువులు భాసినట్లు చరిత్ర చెబుతోంది. నేడు ఆ అమరవీరులను స్మరించుకుంటూ భాజపా నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు.
ఇవీ చూడండి: మాజీ రాష్ట్రపతి చదివిన 154 ఏళ్ల గడియారం పాఠశాల నేలమట్టం