KTR Speech At Hanumakonda Public Meeting :తెలంగాణలో కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. ఎన్నికల టూరిస్టులు వస్తారు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ ట్రాక్ రికార్డు, తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ ట్రాక్ రికార్డు మీ ముందే ఉందని ఎవరి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని ప్రజలే గమనించాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మంత్రి కేటీఆర్ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. భూపాలపల్లిలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్, పోలీస్ కార్యాలయం, డబుల్ బెడ్ రూమ్(Double Bedroom Houses) ఇళ్లను మంత్రి ప్రారంభించారు.
Minister KTR Hanumakonda Tour :ఈ నెల 6వ తేదీన వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో రూ.900 కోట్ల కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్.. నాలుగు రోజులు కూడా గడవక ముందే.. మరోసారి జిల్లాకు విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో కేటీఆర్ భూపాలపల్లికి చేరుకున్నారు. ముందుగా నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.59 కోట్ల 45 లక్షల వ్యయంతో సకల సౌకర్యాలు, అధునాతన హంగులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని.. జిల్లా కలెక్టరేట్ విద్యుద్దీపాలతో ధగధగలాడింది.
'ఎన్నికల టూరిస్టులు వస్తారు జాగ్రత్తగా ఉండాలి. పరకాలలో ధర్మారెడ్డిని 70 వేల మెజార్టీతో గెలిపించాలి. నాటి కాంగ్రెస్.. నేటి బీఆర్ఎస్ పాలనను సమీక్షించుకోండి. రాష్ట్రం రాకముందు కరెంట్, నీళ్ల పరిస్థితి ఆలోచించాలి. కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయం.' -కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి