పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశంలో మరెక్కడా లేవని వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆడపిల్లల పెళ్లి కుటుంబానికి భారం కాకూడదనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్.. ఈ పథకాలను ప్రవేశపెట్టారని వెల్లడించారు. సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 128 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు హన్మకొండలోని ఆయన నివాసంలో ఆదివారం.. చెక్కులు పంపిణీ చేశారు. రూ. కోటి 28 లక్షల 15 వేల విలువ చేసే చెక్కులను అందించారు.
మతతత్వ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి
కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక లోటు సంభవించినా.. రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సీఎం కేసీఆర్ ఆపలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు ఈ పథకానికి అర్హులేనని తెలిపారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలపాలన్న సంకల్పంతో సీఎం కృషి చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు గోదావరి నీటిని అందిస్తున్న ఘనత కేసీఆర్‌దే అని కొనియాడారు. కానీ భాజపా కులమత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఏడేళ్లుగా శాంతియుతంగా ఉన్న రాష్ట్రాన్ని మతాల పేరుతో రెచ్చగొడుతూ నాయకులు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:తపాలా శాఖతో 'హస్తకళ'కు ప్రత్యేక గుర్తింపు: గవర్నర్