Kakatiya Mega Textile Park: వరంగల్ జిల్లా గీసుకొండ సంగెం మండలాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2000 కోట్లతో 1200 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తొలి సారిగా ఏర్పాటు చేసిన గణేష్ ఎకోపేట్ పరిశ్రమతోపాటు రూ.1600 కోట్లతో 187 ఎకరాల్లో నిర్మించనున్న కైటెక్స్ వస్త్ర పరిశ్రమకు ఈ ఏడాది మేలో మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు.
దక్షిణకొరియాకు చెందిన యంగవన్ సంస్ధ ఈ పరిశ్రమ నెలకొల్పనుంది. త్వరలో ఆ పరిశ్రమలు తమ ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు రూ.187 కోట్లతో 220/132 విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించనున్నారు. టీఎస్ఐఐసీ ఎండీ నర్మింహారెడ్డితో కలిసి ట్రాన్స్‌కో ,జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు విద్యుత్ సబ్‌స్టేషన్‌కి భూమిపూజ చేశారు.
సబ్‌స్టేషన్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ 10 ఎకరాల భూమి కేటాయించింది. ఆ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 24 గంటలు విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్న ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు.. ఎన్ని కొత్త పరిశ్రమలు వచ్చినా విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వందకోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్లు అందించేందుకు ట్యాంక్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో కొత్త పరిశ్రమలు తమ ఉత్పత్తులు ప్రారంభించనుండగా.. వేలాది మంది స్థానికులకు ఉపాధి లభించనుంది.