Inavolu Mallanna Swamy Jatara: కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్న కోరమీసాల మల్లన్న బ్రహ్మోత్సవాలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. భక్తుల జయ జయ నాదాలు.. డోలు వాయిద్యాలు.. శివసత్తుల పూనకాలతో మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తి పారవస్యంతో అలరారుతుంది. సంక్రాంతి మొదలు ఉగాది వరకు మూడు నెలల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు.. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో స్వామి వారికి మొక్కులు సమర్పించుకునేందుకు అధికారుల ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హనుమకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్య ఐనవోలు మల్లన్న క్షేత్రం భక్త జన సందోహంగా మారింది. మల్లికార్జున స్వామి వారికి మొక్కులు సమర్పించేందుకు వస్తున్న లక్షలాది మంది భక్తుల భద్రత దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వాహనాల్లో తరలివచ్చే దారులన్నీ పోలీసులు ముందస్తుగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా చెక్ పోస్టులు, పార్కింగ్ స్థలాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సుమారు 300 మందికి పైగా పోలీసు సిబ్బంది జాతరలో సేవలందిస్తున్నట్లు మామూనూరు ఏసీపీ నరేశ్ కుమార్ తెలిపారు. మహిళల భద్రత దృష్ట్యా పదుల సంఖ్యలో షీ టీమ్స్ జాతరలో నిరంతరం గస్తీ కాస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వామివారి దర్శనం మొదలు తిరిగి ఇంటికి వాళ్ళే వరకు అవసరమయ్యే అన్ని రక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.