చెరువు కట్ట తెగి రోడ్డుపైకి నీరు.. భారీగా నిలిచిన వాహనాలు - కోనారెడ్డి చెరువు కట్ట
వరంగల్ గ్రామీణ జిల్లా వర్థన్నపేట పరిధిలోని కోనారెడ్డి చెరువు కట్ట తెగి... రోడ్డుపైకి భారీగా నీరు చేరింది. అధికారులు వాహనాల రాకపోకలను నిలిపిపేశారు. దీంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ పరిధిలోని కోనారెడ్డి చెరువు ఉగ్రరూపం దాల్చింది. కట్ట తెగి ఖమ్మం-వరంగల్ రహదారిపై ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల వర్ధన్నపేట మీదుగా వెళ్ళే ప్రయాణికులు… తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఐదు గంటలుగా బస్టాండ్ ప్రాంతంలో చిక్కుకుని దోమలతో నానా అవస్థ పడ్డారు. వర్షపు నీరు భారీగా ప్రవహించడం వల్ల అధికారులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ప్రయాణికుల ఇక్కట్లు..
వరద ప్రవహంతో వాహనాలు అక్కడికక్కడే నిలిచిపోవడం వల్ల చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి… దోమలు స్వైర విహారం చేసి ప్రయాణికులకు చుక్కలు చూపించాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు, బస్ కండక్టర్, డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.