ఎడతెరిపిలేని వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. శుక్రవారం ఉదయం కాస్త వర్షం తగ్గినా... సాయంత్రం నుంచి మళ్లీ ఊపందుకున్న వాన నగరవాసుల్లో ఆందోళన నింపింది. జేసీబీల సాయంతో నాలాల్లో చెత్తాచెదారం తీసి.. వరదనీరు పారేలా బల్దియా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లలో బురద భారీగా పేరుకుపోయి నిత్యావసర సరకులతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, బియ్యం పాడైపోయాయి. తమను ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎప్పుడు ఏ గట్టు తెగుతుందో..
వరంగల్ గ్రామీణ జిల్లాలో చెరువు కట్టలు బలహీనపడుతున్నాయి. కోనారెడ్డి చెరువు కట్ట తెగడంతో.. ఖమ్మం-వరంగల్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉప్పరపల్లి క్రాస్‌రోడ్ నుంచి పర్వతగరి మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వాహనాలను దారి మళ్లించారు. కోతకు గురైన రహదారి మరమ్మతు పనులను ప్రారంభించారు. ఉప్పరపల్లిలోని ఊర చెరువుకు సైతం గండి పడింది. సకాలంలో గుర్తించిన స్థానికులు ఇసుకబస్తాలు, గడ్డివాములు, రాళ్లతో గండిని పూడ్చడం వల్ల ప్రమాదం తప్పింది.
ఉప్పొంగుతున్న చెరువులు
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెక్కొండ మండలం బంజరుపల్లి, లావుడ్యా వాగ్యా నాయక్ తండాల పరిధిలోని పాలచెరువు ఉప్పొంగుతోంది. చెరువు కట్ట ఓ చోట కుంగడంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి... హుటాహుటిన ప్ల్రొక్లెయిన్ సాయంతో మత్తడిని పగలగొట్టించారు. కట్ట దెబ్బతిన్న ప్రదేశంలో రెండు వేల ఇసుక బస్తాలతో మరమ్మతులు చేయించారు.