GWMC Nala Works :వర్షాలకు మునిగిన వరంగల్ నగరంలో నాలాల ఆధునికీకరణకు సర్కారు సిద్ధమైంది. చిన్న వర్షం పడితే మురుగునీటితో నిండి పోతున్న కాలనీలకు గండం తప్పనుంది. నాలాల ఆధునీకరణతో వరంగల్ వాసుల అవస్థలు త్వరలోనే తీరనున్నాయి. వర్షాలకు ఏ ప్రాంతాలు త్వరగా ప్రభావితం అవుతుందో ఆ ఏరీయాలపై అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీనిపై ఆ ప్రాంతాలన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
GWMC Nala Works to Prevent Floods :వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని నాలాల అభివృద్ధికు అడుగులు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో (Greater Warangal Municipal Corporation)అమలవుతున్న స్ట్రాటజిక్ నాలాల అభివృద్ధి పథకంను వరంగల్‌లో కూడా అమలు చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీంతో కాజీపేట, హనుమకొండ, వరంగల్‌లోని ప్రధాన నాలాల ఆధునీకరణపై ఆశలు చిగురించాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో 985 కోట్లతో 60 పనులు చేపట్టగా నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి నాలాల విస్తరణ చేశారు. ఇదే పద్ధతిని వరంగల్‌లోనూ అమలు చేసేందుకు ప్రత్యేకంగా నిపుణులు రంగంలోకి దిగారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హనుమకొండ, కాజీపేట , వరంగల్ ప్రాంతాలలోని నాళాలను.. ముంపు కాలనీలను పరిశీలించారు.
" 2023లో 28 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఇంతటి భారీ వర్షం కురవడం వరంగల్ చరిత్రలోనే మొదటిసారి. గత 50 ఏళ్ల రికార్డుల్లో చూసినా ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు. భవిష్యత్తులో వచ్చే వరదలు తట్టుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం. రాబోయే కాలం అంతా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి దాని దృష్టిలో ఉంచి తీసుకోబోయే చర్యల గురించి ఆలోచిస్తున్నాం. ఒక కన్సల్టెంట్‌ని పెట్టి తీసుకోబోయే చర్యలపై పూర్తిగా చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం."- శ్రీధర్, వరంగల్ మున్సిపల్ అధికారి