Konda Surekha letter to Revanth reddy: పీసీసీ కార్యనిర్వాహక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి, కొండా సురేఖ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో రేవంత్ రెడ్డిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. అదేవిధంగా తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయాన్ని... ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో కూడా సురేఖ మాట్లాడినట్లు తెలుస్తోంది.
34 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్నతాను.. మాజీ మంత్రి అని కూడా చూడకుండా కార్యనిర్వాహక సభ్యురాలిగా అవకాశం కల్పించిన విషయాన్ని బోసురాజుకు వివరించినట్లు తెలిపారు. పార్టీ అధిష్ఠానం దృష్టికి ఈ విషయాన్నితీసుకెళ్తానని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో కూడా ఈ విషయం మాట్లాడుతానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. తాను ఏఐసీసీతో మాట్లాడి... సాధ్యమైనంత వరకు రాజకీయ వ్యవహారాల కమిటీలో అవకాశం కల్పించేటట్లు చూస్తానని రేవంత్ హామీ ఇచ్చినట్లు కొండా సురేఖ తెలిపారు.
అంతకుముందు.. ఇటీవల ఏఐసీసీ నియమించిన పీసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యత్వానికి కాంగ్రెస్ నేత కొండా సురేఖ రాజీనామా చేశారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ పంపించారు. ప్రదేశ్ కమిటీలో ఏఐసీసీ చేసిన సభ్యుల ఎంపిక అసంతృప్తిని కలిగించాయని తెలిపారు. తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీలో తన పేరు లేకపోవడమే కాదు.. వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ నాయకుడి పేరు లేకపోవడం మనస్తాపం కలిగించిందని పేర్కొన్నారు.