Paddy Procurement Issue in Telangana :రాష్ట్రంలో రైతులు పంటను అమ్ముకోవడానికి నానా అవస్తలు పడాల్సి వస్తోంది. తేమ పేరుతో కొనుగోలు కేంద్రాల్లో తూకం జరగక... అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. తడిచిన ధాన్యానికి తేమ పేరుతో మరో విధమైన దోపిడి చేస్తున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానకు తడుస్తూ... ఎండకు ఎండుతూ... పంట అమ్ముకోవడానికి కర్షకులు నరకయాతన పడుతున్నారు
Paddy Procurement Issue in Warangal :వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఆరు మండలాల్లో దాదాపుగా 45 వేల 71 ఎకరాల్లో యాసంగి వరి సాగు చేశారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తెచ్చి రైతులు పడిగాపులు కాస్తున్నారు. వడ్లు విక్రయించడానికి రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక కర్షకులు బిక్కు బిక్కుమంటున్నారు.
"ధాన్యం అంతా తడిసింది. పంటను కాపాడుకోవడానికి పరదాలు ఇవ్వడం లేదు. కాంటాలు పెట్టడం లేదు. లారీలు అందుబాటులో ఉండటం లేదు. 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. వర్షం వస్తే పరదాల మీదే పడుకోవాల్సి వచ్చింది. వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం. ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. క్వింటాలుకు 4 కిలోలు తరుగు తీస్తున్నారు. దానివల్ల మేం తీవ్రంగా నష్టపోతున్నాం. ఇప్పటికే వానలు మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇప్పుడు వీళ్లు ఇలా చేస్తున్నారు. " - రైతులు