Farmers loss in Warangalఆరుగాలం కష్టపడే రైతు తాను పండించిన పంటను చూసి మురిసిపోతాడు. గిట్టుబాటు ధర రాకున్నా వచ్చేఏడాదికి లాభాలు రాకపోతాయా అనే ఆశతో వ్యవసాయం చేస్తుంటాడు. కానీ చేతికొచ్చిన పంట కళ్ల ముందు వర్షార్పణమైతే మాత్రం తట్టుకోలేడు. ఈ నెల 11 నుంచి 15 వరకు కురిసిన అకాల వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను నష్టాల్లోకి నెట్టాయి. ఈనెల 11 న నర్సంపేట, పరకాల మండలాల్లో దాదాపు రెండు గంటలకు పైగా ఈదురుగాలులతో కురిసిన వర్షంతో భారీ వృక్షాలు నేలకూలాయి. గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి.
Farmers loss in Warangal district: కంటికీ మింటికీ రోదిస్తున్న ఆమె పేరు బుచ్చమ్మ. హనుమకొండ జిల్లా నడికుడ మండలం రాయపర్తికి చెందిన ఆమె మూడెకరాల్లో 4 లక్షల పెట్టుబడితో మిర్చి సాగు చేసింది. గత వారంలో కురిసిన అకాల వర్షానికి పంట పూర్తిగా నీట మునగడంతో కన్నీటి పర్యంతమైతోంది. ఒక్క బుచ్చమ్మే కాదు మిర్చి, మొక్కజొన్న, ఇతర పంటలు వేసిన అన్నదాతలందరిదీ అదే పరిస్ధితి. చేతికి అందివచ్చిన పంటను వరుణదేవుడు తీసుకుపోయాడంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కౌలు రైతులదీ ఇదే దీనస్ధితి. పంట పండించి కొద్దో గొప్పో వస్తే అప్పులు కడదామనుకుంటే అకాల వర్షం తమని నష్టపోయేలా చేసిందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.