ఒకవైపు వరుణుడి రాక.. మరోపక్క భానుడి ధాటికి తట్టుకోలేక ఎండిపోతోన్న పత్తి పంటను చూస్తున్న రైతు పరిస్థితి వర్ణనాతీతం. జూలై గడిచిపోతున్న వర్షాలు కురవకపోవడం వందలాది ఎకరాల్లో పత్తి పంట ఎండిపోతోంది.
వరంగల్ గ్రామీణ జిల్లాలో 70 నుంచి 80 వేల హెక్టార్లలో పత్తి పంటను సాగుచేస్తుంటారు. గతేడాది గులాబీ పురుగు వల్ల పత్తి దిగుబడి తగ్గిపోగా.. ఈసారి అసలు విత్తనాలు వేసేందుకు కాలం కలిసిరావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబడి సంగతి దేవుడెరుగు.. కనీసం పెట్టుబడైనా వస్తుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మొక్కలు ఎండిపోవడం, ఉన్నా.. పెరగకపోవడం, వర్షం ఎప్పుడోస్తుందో తెలియకపోవడం పత్తి రైతును కలవరపాటుకు గురిచేస్తున్నాయి.