సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజున 77మందితో బయల్దేరిన బోటు... ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న 51 మంది జలసమాధి అయిపోగా... 26 మందిని స్థానికులు రక్షించారు. చనిపోయిన వారి కుటుంబాల్లో ఇప్పటికీ ఆ ఘటనకు సంబంధించి గాయాలు మానలేదు.
సొంతవారిని దూరం చేసి... వేదన మిగిల్చిన కచ్చులూరు బోటు ప్రమాదం ఆ బాధ తీర్చలేనిది..
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ నుంచి 14 మంది వెళ్లగా.. వారిలో 9మందిని బోటు కబళించింది. శవాలు దొరికినా... గుర్తుపట్టలేని విధంగా మారింది కొందరైతే... అసలు ఆచూకీ లేకుండా పోయిన వారి వ్యథ మరికొందరిది. ఈ విషాధ సంఘటన ఇప్పటికీ వారి గుండెల్లో పొంగిపొర్లుతూనే ఉంది.
ఆచరణలో సాధ్యం కాలేదు..
ఇంటికి అండగా ఉండేవారిని కోల్పోవడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగానూ, మానసికంగానూ కుంగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో బతుకు బండిని నడిపినా అది కష్టతరంగానే మారింది. వృద్ధులు, ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు పెద్దదిక్కు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం, రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వ హామీలు... ఆచరణలో సాధ్యం కావడం లేదని బాధిత కుటుంబాలు తమ గోడును వెల్లబోసుకుంటున్నాయి.
గోదావరి బోటు ప్రమాదం జరిగి ఏడాది గడిచినా... ఆ కుటుంబాల్లో గాయం ఇంకా ఆరలేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి... కష్టాల్లో ఉన్న తమ కుటుంబాలకు ప్రభుత్వమే దారి చూపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి:పాపికొండల్లో బోటు ప్రమాదం జరిగి ఏడాది..