తెలంగాణ దాహార్థిని తీర్చే మిషన్ భగీరథ పథకం పనులు అధికారుల నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటిని అందించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలకు అధికారుల ఏమరపాటు కళ్లెం వేస్తోంది. వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ పనులు నల్ల వరకే నిలిచిపోయాయి. ప్రజలు నిత్యం నీటి కష్టాలు ఎదుర్కొంటున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం లేకుండా పోయింది.
నీరు కావాలంటే.. పొలానికి వెళ్లాల్సిందే - drinking water problem in warangal rural district
వరంగల్ గ్రామీణ జిల్లాలో ప్రజల నీటి కష్టాలు తీరడం లేదు. మండే వేసవిలోనూ పొలాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి గ్రామంలో నీటి సమస్యను నివారించేందుకు ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో నీరు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్ధన్నపేట మండల పరిధిలో ప్రజలు నీటి కష్టాలతో అల్లాడుతున్నారు. డీసీ తండా, నీలగిరి స్వామి తండాలో తాగునీరు లేక పొలాలకు వెళ్లి బిందెలతో నీరు తెచ్చుకుని అవసరాలు తీర్చు కుంటున్నారు. వేసవి మొదలు ఇప్పటి వరకు పొలాల నీరే తమ దాహాన్ని తీరుస్తుందని ప్రజలు వాపోతున్నారు. భగీరథ నీరు ఏమో కానీ తమ తండాలో కనీసం ఓ బోరైనా వేయమని వాపోతున్నారు.
ఇప్పటికైనా స్పందించండి..
తాగునీరు కావాలంటే వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారి దాటి పొలాలకు వెళ్లాలి.. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు కుడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వాటర్ ట్యాంక్ నిర్మించినా ట్యాంక్‌లోకి నీరు వెళ్లే ప్రధాన పైపు పగిలిపోవడంతో అధికారులు వదిలేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు.
- ఇదీ చూడండి:'పాఠ్యాంశంగా విపత్తు, మహమ్మారి నిర్వహణ'