- జిల్లాలో కేసులు పెరుగుతుండటానికి ప్రధాన కారణం?
జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే, జూన్ 30వరకు 40 కేసులు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారిగా కేసుల ఉద్ధృతి పెరిగింది. జులై 1 నుంచి 17 వరకు మూడింతల కేసులు పెరిగాయి. 122 కేసులు నమోదయ్యాయి. జిల్లా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం వలనే కేసులు పెరుగుతున్నాయి.
- కరోనాను కట్టడికి సర్వే, వైద్య శిబిరాలు ఎలా నిర్వహిస్తున్నారు?
విద్యాసంస్థలు తెరిచి లేనందున ఆర్‌బీఎస్‌కే వైద్యబృందాలతో జిల్లాలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. పీహెచ్‌సీ వైద్యులు ఉదయం ఆసుపత్రిలో వైద్య సేవలు అందించి మధ్యాహ్నం గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు హాజరవుతున్నారు. జిల్లా కార్యాలయంలో సీజనల్ వ్యాధుల నివారణ విభాగం ఏర్పాటు చేసి రోజూ నిర్వహించిన క్యాంపుల వివరాలు సేకరిస్తున్నాం. సర్వే విషయంలో గుర్తించిన ప్రాంతాల్లో నియమించిన సిబ్బందికి కొన్ని ఇళ్లను కేటాయించాం. వీరు 14 రోజులు ప్రతి ఇంటికి వెళ్లి రోగ లక్షణాలు ఉన్నాయా అనే వివరాలు సేకరిస్తారు. వీరు స్థానికులా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారా అనే వివరాలు నమోదు చేస్తారు. ఆ బృందాలు సేకరించిన వివరాలపై పర్యవేక్షకుడు ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు.
- ర్యాపిడ్ కిట్ ద్వారా పరీక్షలు ఎలా చేస్తున్నారు..?
జిల్లాకు వచ్చిన సుమారు వెయ్యి ర్యాపిడ్ కిట్లను పీహెచ్‌సీలకు పంపించాం. ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చాం. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో కొవిడ్ లక్షణాలు ఉన్నవారితో పాటు గర్భిణులకు, ర్యాపిడ్ టెస్ట్ చేయిస్తున్నాం. ప్రజలకు అవగాహన లేక అందరు వచ్చి ర్యాపిడ్ పరీక్ష చేయాలని వరస కడుతున్నారు. తీవ్రంగా జ్వరం, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి చేస్తే ఉపయోగం ఉంటుంది. సామూహికంగా ర్యాపిడ్ పరీక్షలు చేస్తే అసలైన రోగులకు పరీక్షలు చేయలేని పరిస్థితి ఎదురవుతది.
- కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
పాజిటివ్ కేసులున్న ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్‌గా గుర్తించి అక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు జిల్లాలో 20 కంటెయిన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ కట్టడి చేస్తున్నాం. ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. సర్వే వివరాలను కొవిడ్-19 అనే ప్రత్యేక రిజిస్టర్‌లో పొందుపరుస్తున్నాం.
- పాజిటివ్ కేసులను ఎలా గుర్తిస్తున్నారు?
డీఎంహెచ్‌వో: మొదటగా జ్వరం, తరువాత దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందిని తెలుసుకుంటారు. అనుమానముంటే వారి వద్ద ఉన్న థర్మల్ మీటర్‌తో ఉష్ణోగ్రతను పరిశీలిస్తారు. పల్స్ ఆక్సీజన్ మీటర్‌లో పల్స్, రక్తంలో ఆక్సీజన్ వివరాలు చూపిస్తాయి. జ్వరం, దగ్గు ఉండి ఊపిరితిత్తుల సమస్య ఉంటే పీహెచ్‌సీకి.. అక్కడ తగ్గకుంటే శ్వాసకోశ వ్యాధిగా నిర్ధారణ చేసుకొని జిల్లా ఆసుపత్రికి పంపిస్తారు. వీటితో పాటు ఫ్లూ లక్షణాలున్నా ఐసోలేషన్ వార్డుకు పంపిస్తాం. నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తాం.