రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట కేసు ఘటనలో తొమ్మిది మంది హత్యకు కారణమైన నిందితుడు సంజయ్ కుమార్‌కు.. కేవలం 25 రోజుల్లోనే శిక్ష పడేలా కృషి చేసిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.
వరంగల్ పోలీస్ కమీషనర్ ప్రమోద్ కుమార్, డీసీపీ కె. వెంకటలక్ష్మిలతో సహా మొత్తం 12 మంది పోలీసు అధికారులను డీజీపీ ఘనంగా సన్మానించి పురస్కారాలను అందజేశారు. గొర్రెకుంట కేసు కేసులో కీలక పాత్ర వహించిన మాజీ పోలీస్ కమిషనర్ వీ. రవీందర్‌ను సైతం డీజీపీ అభినందించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గొర్రెకుంట శివారులో 9 మంది హత్యకు గురైన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ఆ కేసును ఛేదించిన పోలీసులు సంజయ్ కుమార్‌ని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. 25 రోజుల్లోనే అన్ని ఆధారాలతో సహా 485 పేజీల చార్జిషీట్లు దాఖలు చేశారు. విచారణలో దోషిగా తేలడం వల్ల మొదటి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయ కుమార్ తీర్పును వెలువరిస్తూ సంజయ్ కుమార్‌కు ఉరిశిక్ష విధించారు.
రికార్డు సమయంలో నిందితుడిపై పకడ్బందీ చార్జిషీటు దాఖలు చేసి శిక్షపడేలా కృషి చేసిన పోలీసు అధికారులను డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కేసును ఛేదించిన వరంగల్ పోలీసులు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని డీజీపీ ప్రశంసించారు.
ఇదీ చూడండి :చేయీ చేయీ కలిపారు... పేదింటి అమ్మాయి పెళ్లి చేశారు