Rain Effect on Crops: రాష్ట్రంలో పలు జిల్లాలో కురిసిన వడగళ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కారణంగా నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో ఇంటి పై కప్పులు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.
వడగండ్ల వానతో రైతుల ఇక్కట్లు మహబూబాబాద్ జిల్లాలోని గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లో కల్లాలలో ఎండబెట్టిన మిరపకాయలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈసారి వరి పంటకు బదులుగా వాణిజ్య పంటలు, ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో చాలా మంది రైతులు పల్లి, మిర్చి, బొబ్బెర్లు, బంతి ఇతరత్రా వాణిజ్య పంటలు వేశారు. పంట వేయడానికి అదను దాటడంతో రైతుల నేరుగా భారీగా ఖర్చు పెట్టి నారు, మిర్చి మొక్కలు తీసుకొచ్చి నాటారు. గత రాత్రి కురిసిన వడగండ్ల వర్షంతో మిర్చి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పెట్టుబడి వృథా
రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టి 4 ఎకరాల్లో ఆరు తడి పంటలు సాగు చేశాను. నిన్న కురిసిన రాళ్ల వర్షంతో పంట మొత్తం దెబ్బ తింది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. ఓట్ల సమయంలోనే కాకుండా ఆపత్కాలంలోనూ రైతులను పట్టించుకోవాలి. -బాధిత రైతులు
వేల ఎకరాల్లో నష్టం
నర్సంపేట డివిజన్‌లో 14 నుంచి 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేశామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆస్తి నష్టం కూడా అంచనా వేస్తున్నామని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.
దాదాపు 100కు పైగా గ్రామాల్లో వడగండ్ల వాన ప్రభావం తీవ్రంగా ఉంది. రేపటి వరకు వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిర్చి రైతులు ఎక్కువగా నష్టపోయారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా. బాధిత రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తా. -పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే
దెబ్బతిన్న పంటలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, శంకరపట్నం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రామడుగు, గంగాధర, మానకొండూరు, సైదాపూర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్, పెద్దపల్లి, పెగడపల్లి, ధర్మారం మండలాల్లో ఏకధాటిగా వర్షం కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ సూచన మేరకు తాము వాణిజ్యపంటలు వేశామని పొలాలను పరిశీలించి ఆర్థిక సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలతో పంట నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు.
ఇదీ చదవండి:Telangana Rains : రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షం