crop damage in hanumakonda district: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా మొక్కజొన్న పంటలు నేలవాలాయి. చేతికొచ్చే సమయంలో నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొక్కజొన్న నిటారుగా ఉంటే మిషన్ల సహాయంతో కోతలు కోస్తే... కూలీల ఖర్చు తక్కువయ్యేది. కానీ నేలవాలిన మొక్కజొన్నను మెషిన్లు కోయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కూలీల ఖర్చులు పెరిగిపోయి అదనపు భారం అవుతుందని రైతులు చెపుతున్నారు. వానకు దెబ్బతినగా మిగిలిన పంటను కాపాడుకున్న రైతులు వాటిని కల్లాల్లో ఆరోబోసి, అమ్మేందుకు ఎదురుచూస్తున్నారు.
ఒక మనిషి చేయవలసిన పని ఇద్దరు: వర్షాలకు తడిసిన మొక్కజొన్న రంగు మారుతోంది. వీటికి గిట్టుబాటు ధర కల్పించి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వర్షం కారణంగా కిందకు వాలిన మొక్కజొన్న నుంచి కంకులు విరవాలంటే... ఒక మనిషి చేసే పనిని ఇద్దరు చేయాల్సి వస్తోంది. దీంతో రైతులపై కూలీల ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయి. మొక్కజొన్న కిందపడడంతో ఒక మనిషి చేయవలసిన పని ఇద్దరు చేయాల్సివస్తుందని దీంతో రైతులపై కూలీల ఖర్చు అదనపు భారం పడుతుందని వాపోతున్నారు.