Cotton Farmers Problems in Warangal : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. వర్షాకాలం వచ్చి నెల రోజులు గడిచినప్పటికీ వేసవి కాలం పరిస్థితిలే కనిపిస్తున్నాయి. విపరీతమైన ఎండలతో రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. విత్తుకున్న విత్తనాలను మొలకెత్తించేందుకు.. మొలచిన విత్తనాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు చేసే రైతులు విత్తనాలు నాటి సుమారు నెల రోజులు గడుస్తున్నా.. వాటిని కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తుందని ఆశతో పత్తి విత్తనాలను పెట్టిన రైతులు వర్షాలు ముఖం చాటేయడంతో.. వాటిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు.
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి వర్షాలు లేక నెల రోజులపాటు వ్యవసాయ పనులు వెనక్కి వెళ్లాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది జులైలో కలుపు తీయడం, ఎరువులు వేయడం లాంటి పనుల్లో రైతులు నిమగ్నమై ఉన్నారని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పటి వరకు సమృద్ధిగా రుతుపవనాలు రాక వర్షాలు సరిగా పడకపోవడంతో వర్షం కోసం రైతులందరం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నామని అన్నారు.
"20 రోజులు అవుతుంది పత్తి గింజలు వేసి.. వర్షాలు పడతాయో లేదో అని గింజలకు నీళ్లు కడుతున్నాము. కౌలు పైసలు ఎకరానికి రూ.20 వేలు. ఈసారి ఖర్చులకు వస్తాయో రావో. గింజలను వేస్తే మొలకలు కూడా వచ్చాయి.. కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండడం.. వర్షాలు రాకపోవడంతో అవి కూడా పోయే పరిస్థితి వచ్చింది." - రైతు