వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా రెండో దశ విలయ తాండవం చేస్తోంది. కేసుల పెరుగుదలతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో కరోనా దాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. గడిచిన 20 రోజుల వ్యవధిలో 9 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
తొలుత రెండు కరోనా మరణాలు సంభవించిన సమయంలో అధికారులు గ్రామస్థులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒకే రోజు 90 కేసులు వెలుగు చూసాయి. అలా రెండు సార్లు అడపా దడపా పరీక్షలు నిర్వహించి వారు వెళ్లిపోయారు. ఆ తరువాత గ్రామంలో రెండు రోజులకు ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు వీరమళ్ళ కృష్ణారెడ్డి, యశోదలను మహమ్మారి పొట్టన పెట్టుకుంది.