వరంగల్ జిల్లాలోని ఎంజీఎం కొవిడ్ వార్డులోకి రెండు రోజులుగా కొత్తగా అనుమానిత కేసులు రాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు క్రమంగా నియంత్రణలోకి వస్తున్నాయి. రెడ్‌జోన్లలో ప్రైమ్ కాంటాక్ట్‌లను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించడం పూర్తయ్యింది. ఇప్పటికే రూరల్ జిల్లా గ్రీన్ జోన్‌గా కొనసాగుతోంది. జనగామ, ములుగు, జయశంకర్, మహబూబాబాద్ జిల్లాల్లో తాజాగా కొత్త కేసులు లేవు. అర్బన్ జిల్లాలో ఏప్రిల్ 25న చివరి కేసు నమోదైంది. ఆ తర్వాత ఎంజీఎం నుంచి కానీ, ఆరు జిల్లాల పరిధిలో కానీ కొత్త కేసులు లేకపోవడం ఉపశమనం కలిగించే విషయం. కేసులు నియంత్రణలోకి వస్తుండడంతో వైద్యులు, అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇంటింటికీ తిరుగుతూ..
వైద్యాధికారుల నేతృత్వంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇతర సిబ్బంది ఇంటింటి సర్వే ముమ్మరంగా చేపడుతున్నారు. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎవరైనా దగ్గు, జ్వరం, జలుబు తదితర లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. అధికారులు అవసరమైతే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కృషి చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 17 కంటెయిన్‌మెంటు ప్రాంతాలు ఉండగా, చాలా మందికి రిపోర్టులు నెగెటివ్ వస్తున్న క్రమంలో ఆయా ప్రాంతాల్లో పలు సడలింపులు ఇస్తున్నారు.