Bio Mining in Warangal : వరంగల్‌లో చెత్త సమస్య పరిష్కారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాంపూర్‌లోని డంపింగ్ యార్డులో చెత్తశుద్ధికి ఇప్పటికే బయోమైనింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఈ చెత్త శుద్ధి ద్వారా వచ్చే జీవ ఎరువు-బయోఎర్త్.. పంటలకు ఎరువుగా పనికొస్తుందని గ్రహించిన జీడబ్ల్యూఎంసీ అధికారులు.. దీన్ని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. ఫలితాలను విశ్లేషించి, బయోమైనింగ్‌లో వెలువడే జీవ ఎరువును.. పరిసరాల్లోని రైతులకు ఉచితంగా అందించనున్నారు.
రూ.36 కోట్లతో ప్రక్రియ..
Bio Fertilizer From Garbage : చెన్నైకి చెందిన లీప్ ఎకో టెక్ సొల్యూషన్స్ అనే కంపెనీ చెత్త శుద్ధీకరణ చేపడుతోంది. 36 కోట్ల వ్యయంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రోజుకు సుమారు 900 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేస్తారు. మూడు యంత్రాల ద్వారా రాత్రింబవళ్లు చెత్త శుద్ధి జరుగుతోంది. 100 ఎంఎం కన్నా ఎక్కువ పరిమాణంగల వ్యర్థాలు అంటే.. పెద్దపెద్ద ప్లాస్టిక్ బాటిళ్లు, దుస్తుల లాంటివి మొదటి దశలో బయటకు వస్తాయి. తర్వాత దశలో చిన్న సైజులో ఉండే వ్యర్థాలు బయటకొస్తాయి. ఇలా మూడు దశల్లో వచ్చే వ్యర్థాలను.. సిమెంటు పరిశ్రమలకు పంపిస్తారు. 8ఎంఎం కన్నా తక్కువ పరిణామం ఉండే వ్యర్థాలు.. చివరకు సేంద్రీయ ఎరువుగా మారతాయి.