ఒక రోజు పర్యటన కోసం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో హనుమకొండకు విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దామెర క్రాస్ రోడ్డు వద్ద ప్రతిమా క్యాన్సర్ ఆసుపత్రి, వైద్య కళాశాలలను ప్రారంభించారు . మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, గంగుల కమాలకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం వివక్షతో ఒక్క వైద్య కళాశాల మంజూరుచేయపోయినా.. దూరదృష్టితో వైద్య విద్య కోసం రష్యా,ఉక్రెయిన్, చైనా పోయే బాధలు తప్పించామని వివరించారు.
ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టులు తయారు చేశామన్న సీఎం త్వరలో 119 నియోజకవర్గాల్లోనూ చేపడతామన్నారు. అత్యాధునిక వసతులతో వరంగల్‌లో నిర్మించ బోయే సూపర్ స్పెషాలిటీ రాష్ట్రానికే తలమానికంగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం కొందరు విషబీజాలు నాటుతున్నారని తెరాస అధినేత వ్యాఖ్యానించారు.
జాతీయ రాజకీయ పరిస్థితులు, రావాల్సిన మార్పులపై కేసీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అద్భుత వనరులతో గొప్ప సహనశీల దేశం కొందరి స్వార్థరాజకీయాలతో వెనకబడి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారినపుడే దేశ పురోగతి సాధ్యమని పునరుద్ఘాటించారు . దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.