రాష్ట్రంలోని ఉన్నత విద్యావంతులను ప్రభుత్వం మోసం చేస్తోందని వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ భాజపా అభ్యర్ధి గుబుల ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్నారు. అధికారంలోకి వచ్చాక ఇల్లు లేని వారికి రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.
కేంద్రం నిధులతోనే పనులు:
రాబోయే కాలంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారంటూ ప్రచారాలు చేస్తున్నారని, దాని వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టభద్రుల కోసం ఏం చేశారో స్పష్టం చేయాలన్నారు. తన కళాశాలకు యూనివర్సిటీ హోదా తెప్పించుకున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నిరుద్యోగ భృతి ఇస్తామంటూ మభ్యపెడుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వం మాటలు నమ్మే స్థితిలో విద్యావంతులు లేరని తెలిపారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కాంట్రాక్టులు ఉంటే సరిపోతుందని, ప్రజల సమస్యలపై ఆయనకు పట్టింపు లేదన్నారు.
ఇదీ చూడండి :హోంమంత్రిని కలిసిన జాతీయ మైనార్టీ కమిషన్ వైస్ ఛైర్మన్