Bandi Sanjay wrote a letter to CM KCR: తక్షణమే వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి జులై ఒకటో తేదీ నుంచి ఉద్యోగులకు పెరిగిన జీతాలు చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నెల 9న జరగబోయే కేబినెట్ సమావేశంలో పీఆర్సీ ఏర్పాటుతో పాటు మూడు నెలల్లో నివేదిక తెప్పించుకుని జులై ఒకటి నుంచి కొత్త పీఆర్సీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో ప్రజలకిచ్చిన హామీలన్నింటిపై చర్చించి తక్షణమే అమలయ్యేలా నిర్ధిష్ట కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. లేనిపక్షంలో ఆయా హామీల అమలు కోసం బీజేపీ పక్షాన ప్రజలతో కలిసి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. జరుగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రీతి కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదు : ఇటీవల వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందిన మెడికో విద్యార్థి డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండాలోని యువతి నివాసానికి వెళ్లిన బండి సంజయ్... ప్రీతి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రీతిది ఆత్మహత్య కాదు... హత్యేనని బండి సంజయ్ ఎదుట ప్రీతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రీతి కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న బండి... న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రీతి ఘటనను ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశామని గుర్తుచేసిన సంజయ్... ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.