Bandi Sanjay on Munugode Bypoll: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు తెరాస సిద్ధమైందని ఆరోపించారు. అధికారం అడ్డుతో కేసీఆర్ పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హనుమకొండలోని అభిరామ్ గార్డెన్లో జరిగిన ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల నరసయ్య సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన.. గుజ్జల నరసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు తెరాస, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భాజపా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాగి తందనాలు ఆడటానికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.