పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక అంశాలు, స్త్రీ, పురుషుల మధ్య తేడాలు, ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ లాంటి ఎన్నో ప్రశ్నలు చిన్నారుల మెదడుకి మొగ్గదశలోనే తెలియజేయాలి. మనిషితోలు కప్పుకున్న మృగాల దాడిలో ఎందరో చిన్నారుల బతుకులు నాశనం అవుతున్నాయి. తమపై జరుగుతున్న కొన్ని అకృత్యాలు చెప్పుకునేందుకు భయపడో, సిగ్గుపడో ఎవ్వరితోనూ పంచుకోరు. ఇలాంటి వాటికి పరిష్కారం కోసం సరైన వేదిక పాఠశాలే అని గుర్తించి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వరంగల్ గ్రామీణ జిల్లా యంత్రాగం యువ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలలకు రక్షణ కల్పించి, భరోసా ఇచ్చేందుకు ఇంటా బయట తోటి వారితో ఎలా మెలగాలి అన్న విషయాలతో పాటు... బాలల హక్కులు, బాల్య వివాహాలు, అక్రమ రవాణా తదితర అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.
రెండు బృందాలు.. వారానికి నాలుగు స్కూళ్లు
ఈ కార్యక్రమం కోసం జిల్లా వ్యాప్తంగా 151 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రతి మంగళ, శుక్రవారం ఈ కార్యక్రమం చేపడతారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా కొన్ని సంక్షిప్త చిత్రాలను సిద్ధం చేశారు. మొత్తం రెండు బృందాలుగా వారానికి నాలుగు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇబ్బందులను చెప్పుకునేలా
ఈ బృందంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుంచి ముగ్గురు, విద్య వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక్కొక్కరూ కౌన్సిలర్లుగా ఉంటారు. అంతేకాకుండా అన్ని కేజీబీవీ పాఠశాలల్లో బాలికల ఇబ్బందులు తెలుసుకునేందుకు ఓ పెట్టె ఉంచుతారు. శారీరకంగా గానీ, మానసికంగా గానీ బాలికలకు భయాలు లేకుండా ఎదుర్కునే సమస్యలు చెప్పుకునేందుకు ఇది చాలా ఉపకరిస్తోంది.