ప్రతి రైతు తాను చేసే వ్యవసాయాన్ని వ్యాపారంగా చూడాలని, అలా చూసినప్పుడే రైతులు లాభసాటి వ్యవసాయం చేసిన వారవుతారని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పేర్కొన్నారు. లాభసాటి నియంత్రిత వ్యవసాయ సాగుపై పెద్దమందడి మండలం బలిజేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్ రైతులకు పలు సూచనలు చేశారు. ప్రతి రైతు లాభపడాలని గత రెండేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచనలకు రూపకల్పన జరిగిందన్నారు. వరిలో సన్న రకాలను సాగు చేసుకోవాలని రానున్న కాలంలో ఎక్కువగా డిమాండ్ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతులు అన్ని విధాలా లాభపడతారని సూచించారు. వర్షాకాలంలో మొక్కజొన్న పంటను సాగు చేసి రైతులు నష్టపోతున్నారని, రైతులు నష్టపోయే పంటల సాగు తగ్గించుకోవాలని మొక్కజొన్న పంట సాగు స్థానంలో పత్తి, కంది, జొన్న, ఆముదం లాంటి పంటలను సాగు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ రైతులకు సూచించారు.
'వ్యవసాయాన్ని వ్యాపారంతో సమానంగా చూడాలి' - wanaparthy district news
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజేపల్లి గ్రామంలో నియంత్రిత వ్యవసాయ సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు వ్యవసాయాన్ని వ్యాపారంతో సమానంగా చూసినప్పుడే రైతులు లాభసాటి వ్యవసాయం చేసిన వారవుతారని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు వ్యక్తం చేసిన అనుమానాలను కలెక్టర్ నివృత్తి చేశారు. వానాకాలంలో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, జిల్లాలో జూన్, జూలై నెలలకు 13 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ప్రతి క్లస్టర్లో ఒక రైతు వేదిక నిర్మాణం చేపడుతున్నామని, జిల్లాలో 71 క్లస్టర్లు ఉన్నాయని, ఆరు నెలల్లో ఈ వేదికల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పెద్దమందడి మండలంలో దాదాపు అన్ని రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారని, ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు రాజప్రకాష్ రెడ్డి, సర్పంచ్ జయంతి, మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'రైతుకు లాభం కోసమే.. నియంత్రిత సాగు'