వివిధ ఎత్తిపోతల పథకాల కింద పెండింగ్లో ఉన్న భూసేకరణ, పునరావాస కేంద్రాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయా ప్రాజెక్టుల ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పునరావాస కేంద్రాలు, భూసేకరణపై సమీక్ష నిర్వహించారు.
పాలమూరు - రంగారెడ్డి, రాజీవ్ భీమా, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాల కింద దాదాపుగా భూసేకరణ పూర్తయిందని, అయితే పెండింగ్లో ఉన్న చోట త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు పనులు చేపట్టి సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా భూసేకరణ పనులు ఎందుకు పెండింగ్లో ఉండాల్సి వచ్చిందో ఆయా ప్రాజెక్టుల వారీగా సమస్యలపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.