రెండు రోజులుగా కొనసాగుతున్న ఆన్లైన్ తరగతులను వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష పరిశీలించారు. వనపర్తి పట్టణ శివారులోని నాగవరంలో ఇంటింటికి తిరిగి విద్యార్థుల డిజిటల్ తరగతులు పరిశీలించారు. విద్యా బోధనల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కేవలం అరగంట మాత్రమే తరగతులు జరుగుతున్నాయని తెలుసుకున్న కలెక్టర్... గంట వరకు పెంచాలని జిల్లా విద్యాధికారి సుశీంద్ర రావుకు సూచించారు.
'ఆన్లైన్ తరగతులను షెడ్యూల్ ప్రకారం తప్పక నిర్వహించాలి'
వనపర్తి జిల్లాలో కొనసాగుతోన్న ఆన్లైన్ తరగతులను కలెక్టర్ షేక యాస్మిన్ బాష పర్యవేక్షించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తరగతులను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు.
వనపర్తి జిల్లా పరిధిలో తొలిరోజు ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు 25996 మంది విద్యార్థులు హాజరయ్యారు. మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు జిల్లా మొత్తంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 35384 మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఒక్కో పాఠశాలలోని విద్యార్థులను విభాగాలుగా విభజించి ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారన్నారు. దత్తత తీసుకున్న విద్యార్థులు ఆన్లైన్ తరగతి బోధన, సమస్యల నివృత్తి, ప్రతి విద్యార్థి తరగతులకు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని డీఈఓ పేర్కొన్నారు.