తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్‌ఐపై పెట్రోల్‌ పోసి చంపుతామని బెదిరింపులు

భూమిని తమ పేర్ల మీద నమోదు చేయకపోతే... చంపేస్తామంటూ వనపర్తి జిల్లా వీపనగండ్ల తహసీల్దార్​ కార్యాలయంలోని ఆర్​ఐపై ఇద్దరు వ్యక్తులు బెదిరించారు. హైదరాబాద్‌లోని తహసీల్దార్‌ విజయరెడ్డిపై జరిగిన దాడి లాంటి గతే వారికీ పడుతుందని ఆర్​ఐని హడలెత్తించారు.

veepangandla ri complaint to police
veepangandla ri complaint to police

By

Published : Sep 10, 2020, 8:10 AM IST

వనపర్తి జిల్లా వీపనగండ్ల తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఐ రాజేశ్వరిపై ఇద్దరు వ్యక్తులు పెట్రోల్‌ పోసి చంపుతామని బెదింపులకు పాల్పడ్డారు. మంగళవారం సాయంత్రం కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా... వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన తోలు రాము, తూంకుంట గ్రామానికి చెందిన మంద నర్సింహ కార్యాలయానికి వచ్చారు. వీపనగండ్ల, తూంకుంట గ్రామాల శివారులో ఉన్న భూమిని తమ పేర్ల మీద నమోదు చేసేందుకు పంచనామా ఎందుకు ఇవ్వడం లేదని టేబుల్‌ను ఆర్‌ఐపై వేసేందుకు ప్రయత్నించారు. ఉపతహసీల్దార్‌ లక్ష్మీకాంత్‌, అక్కడే ఉన్న వీఆర్వోలు అడ్డుకున్నారు.

భూమిని తమ పేర్లపై నమోదు చేసేలా పంచనామా ఇవ్వకుంటే గతంలో హైదరాబాద్‌లోని తహసీల్దార్‌ విజయరెడ్డిపై జరిగిన దాడి లాంటి గతే వారికీ పడుతుందని బెదిరించారు. ఇదే విషయంపై బుధవారం ఉదయం బాధితురాలు ఆర్‌ఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ యేషయ్యను సంప్రదించగా.. తూంకుంట గ్రామానికి సంబంధించిన భూమి వ్యవహారం కోర్టు పరిధిలో ఉందన్నారు. వీపనగండ్ల గ్రామానికి చెందిన భూమి సమస్య పాలి భాగస్థుల మధ్యన పరిష్కారం కావడంలేదని తెలిపారు. ఆర్‌ఐని చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఘటన వాస్తవమేనని... ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details