కొత్త సంవత్సరంలో వరుసగా వెలువడిన ఉద్యోగ ప్రకటనలు ఈసారైనా జాబ్ సాధించొచ్చు అనే అవకాశాలు యువతను ఊరిస్తున్నాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నిరుద్యోగులు, ఉద్యోగార్థులు నూతన సంవత్సరంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలకు కోసం ఇప్పటికే కొన్నింటికి పరీక్షలు నిర్వహించడం, మరికొన్నింటికి నోటిఫికేషన్లు ఇవ్వడంతో వీటికి సంబంధించి ఉద్యోగ నియామకాల ప్రక్రియ 2023లో పూర్తవుతుందని అందరూ ఆశిస్తున్నారు. కొలువు సాధించాలనే లక్ష్యంతో వేలాది మంది పట్టుదలతో అహరహం శ్రమిస్తున్నారు. తెరాస ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ ప్రకటనలు ఇస్తుండడంతో కొలువుల జాతరకు 2023 సంవత్సరం స్వాగతం పలుకుతోంది. స్పష్టమైన లక్ష్యాలతో కోరుకున్న కొలువులను సొంతం చేసుకుని జీవితంలో ఈ ఏడాదిని మరపురానిదిగా ఉండేలా సమాయత్తం అవుతున్నారు.
ఉద్యోగాల్లో 95శాతం స్థానిక జిల్లాల వారికే కేటాయించనుండడంతో మొత్తం 4,429 ఖాళీల్లో 4,207 ఖాళీల్లో స్థానికులకే ఉద్యోగాలు రానున్నాయి. వివిధ శాఖల్లో జిల్లా స్థాయి, జోనల్, మల్టీ-జోనల్ స్థాయిలో నియామకాలను ప్రభుత్వం చేపడుతోంది. జిల్లా స్థాయిలో అటెండరు, రికార్డు అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు నియామకాలుంటాయి. జోనల్ స్థాయిలో సీనియర్ అసిస్టెంటు, సూపరింటెండెంట్ నియామకాలు చేపట్టనున్నారు. శాఖలను బట్టి జోనల్ వ్యవస్థలో నియామకాలు మారుతుంటాయి. మల్టీజోనల్ వ్యవస్థలో గ్రూపు స్థాయి ఉద్యోగాలుంటాయి. గ్రూపు-1లో 503, గ్రూపు-2లో 783, గ్రూపు-3లో 1,365, గ్రూపు-4లో 8,039 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు పాలమూరు జిల్లాల యువత గట్టిగా సన్నద్ధం అయితే గ్రూపు స్థాయిలోనూ ఉద్యోగాలు సాధించవచ్చు. వీటితోపాటు పోలీసు ఉద్యోగాల కోసం కూడా ఎంపికలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా స్టాప్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్(బ్యాంకు ఉద్యోగాలు) కూడా నోటిఫికేషన్లు వేశారు.
ఏడాది కలిసి రావాలి..ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేల మంది అభ్యర్థులు సమీప పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు వస్తున్నారు. కొందరు వసతి గృహాల్లో, మరికొందరు అద్దె గదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న అకాడమీ పుస్తకాలతోపాటు వివిధ దినపత్రికలను చదువుతున్నారు. కొత్త సంవత్సరలో పోటీ పరీక్షల్లో నెగ్గి కొలువు సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2023లో స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగితే కొలువు సాధించడం కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. సరైన ప్రణాళిక, సమయపాలన, ప్రామాణిక మెటిరీయల్స్, సొంత నోట్సుతో పోటీలకు సన్నద్ధం కావాలని సూచిస్తున్నారు. ఉద్యోగార్థులు కొత్త సంవత్సరం సందర్భంగా గట్టి సంకల్పాన్ని తీసుకోవడమే తరువాయి.
రెట్టింపు ఉత్సాహంతో..'నేను ఎంఏ ఎకానామిక్స్ చేశాను. 2019 నుంచి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాను. ఈ సారి అన్ని నోటిఫికేషన్లు రావడంతో రెట్టింపు ఉత్సాహంతో సన్నద్ధమవుతున్నాను. ఈ కొత్త సంవత్సరంలో ఉద్యోగం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసం ఉంది.'- అజయ్‌బాబు, వనపర్తి