వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌కు చెందిన యూసుఫ్, జహీరాబీ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. యూసుఫ్ సంతలో మిఠాయిలు అమ్ముతూ, అప్పడుప్పుడూ వంటలు చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవారు. ఇలా ఇద్దరు కుమారులు, పెద్దకుమార్తెకు వివాహం చేశారు. చిన్నకూతురు పర్వీనాబేగం బాల్యంలోనే కంటిచూపు కోల్పోగా... ఆమెకు చూపు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తల్లిదండ్రులుంటే తప్ప ఆమె జీవనం గడవదు. చిన్నకుమారుడు లతీఫ్ తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. భవిష్యత్తులో తమకు అండగా ఉంటాడనుకుని తల్లిదండ్రులు భావించినా... ఆ ఆశ ఎంతో కాలం నిల్వలేదు.
వాళ్ల శోకం వర్ణణాతీతం
2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో లతీఫ్ కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయాయి. కుమారున్ని బాగుచేయించేందుకు ఉన్న డబ్బంతా ఖర్చు చేశారు. కర్నూల్లో ఇంటి స్థలాన్ని అమ్మేశారు. అయినా ఫలితం లేకపోయింది. డబ్బుల్లేక వైద్యం నిలిపివేశారు. పదేళ్లుగా లతీఫ్ మంచానికే పరిమితమయ్యారు. కదల్లేరు, మెదల్లేరు. అన్నిసపర్యలూ తల్లిదండ్రులు చేయాల్సిందే. చేతికందొచ్చిన బిడ్డ... కుప్పుకూలి పోవడంతో తల్లిదండ్రులిద్దరి శోకం వర్ణణాతీతంగా మారింది.
మరో పిడుగు
అప్పటికే ఊహించని కష్టాలను ఎదురీదుతూ వస్తున్న ఆ కుటుంబంపై లాక్డౌన్ సమయంలో మరో పిడుగు పడింది. యూసుఫ్‌కు అన్నివేళల్లో అండగా ఉంటూ.. బిడ్డల బాగోగులు చూసుకుంటున్న భార్య జహీరాబీ ఒక్కసారిగా పక్షవాతానికి గురైంది. ఇన్నేళ్లు కుటుంబానికి అన్నీతానై సేవలు చేసిన జహీరాబీకి ఇప్పుడు ఇంకొకరు సపర్యలు చేస్తే తప్ప గడపలేని పరిస్థితి. ఇన్నేళ్లు జహీరాబీ పిల్లల్ని చూసుకుంటుంటే... యూసుఫ్ ఎంతో కొంత సంపాదించి తీసుకొచ్చేవాడు. ఇప్పుడామె కూడా అనారోగ్యానికి గురవటంతో... ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. మంచానికే పరిమితమైన లతీఫ్‌కు తండ్రి సేవలు చేస్తుండగా... తల్లికూతుళ్లకు అత్తారింటి నుంచి వచ్చిన పెద్దకూతురు సపర్యలు చేస్తోంది.