తెలంగాణ

telangana

ETV Bharat / state

చదువుకోవడానికి అన్నీ ఉన్నాయి.. తరగతి గదులు తప్ప...

అక్కడ చదువుకోవడానికి విద్యార్థులున్నారు. చదువు చెప్పడానికి ఉపాధ్యాయులున్నారు. కానీ విద్యార్థులు కూర్చోవడానికి తరగతి గదుల్లేవు. అన్ని సౌకర్యాలు ఉంటేనే అది పాఠశాల అవుతుంది. కానీ ఇక్కడ ఎండొచ్చిన.. వానొచ్చిన విద్యార్థులకు నిలువ నీడ లేదు.

By

Published : Nov 16, 2019, 5:06 PM IST

తరగతి గదుల్లేని పాఠశాల

తరగతి గదుల్లేని పాఠశాల

వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ మండలం శేర్​పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శేర్​పల్లిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉంది. మొత్తం 106 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. బోధించడానికి నలుగురు ఉపాధ్యాయులు ఉండగా... గ్రామస్థులు అందరూ కలిసి ఇంకో ఇద్దరు ప్రైవేటు విద్యావాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నారు.

తరగతి గదులే లేవు...

పాఠశాలలో ప్రత్యేకంగా వంటగది, విద్యార్థులకు సరిపోయినన్ని టాయిలెట్లు, పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ ఉన్నాయి. కానీ విద్యార్థులు కూర్చోవడానికి మాత్రం తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నారు. పాఠశాల మొత్తంలో రెండు గదులు మాత్రమే ఉండగా... వాటిలో ఒకటి ప్రధానోపాధ్యాయుడి గది.. మిగతా గదిని రెండు భాగాలుగా చేసి రెండు తరగతులు నిర్వహిస్తున్నారు.

వర్షం వస్తే అంతే..

మిగతా తరగతులను ఆరు బయట వరండాలో చెట్ల కింద నిర్వహిస్తున్నారు. తరగతి గదులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసిన యువకులు.. గ్రామ పెద్దలతో చర్చించి చందా రూపంలో నగదు జమ చేసి తాత్కాలికంగా తడకలతో రెండు తరగతి గదులను ఏర్పాటు చేశారు. కానీ వర్షాకాలంలో.. తడక గదుల్లోకి కూడా నీరు రావడం వల్ల తరగతుల నిర్వహణ ఇబ్బందవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా స్పందించండి..

తరగతి గదుల కొరత ఉన్న మాట వాస్తవమేనని.. సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా.. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాల గదులను నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : అన్నంపెట్టే అమ్మ లేదు.. నడిపించే నాన్న రాడు...

ABOUT THE AUTHOR

...view details