తెలంగాణ ప్రభుత్వం భారీ, మధ్య తరహా, చిన్ననీటి పారుదల శాఖలు, ఐడీసీలను నీటి పారుదల శాఖలో విలీనం చేశారు. పూర్తిస్థాయిలో అధికారుల నియామకం లేకపోవడంతో ఎత్తిపోతల వద్ద రక్షణ చర్యలు లేకుండా పోయాయి.
రూ. 15 కోట్ల విలువైన పరికరాలు :
కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పెంట్లవెల్లి కృష్ణాతీరాన మల్లేశ్వరం, వేంకల్ ప్రాంతంలో ఎంగంపల్లి ఎత్తిపోతల, వేంకల్ ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. రూ. 3 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వీటిని నిర్మించారు. ప్రధానమైన ఇనుప పైపులు, పంపుమోటార్ల విడిభాగాలు తస్కరణకు గురవుతున్నాయి. మంచాలకట్ట తీరాన రూ. 2 కోట్లతో నిర్మించిన మాధవస్వామినగర్ ఎత్తిపోతల పథకానికి రక్షణ కరవైంది. ఇక్కడి విద్యుత్తు నియంత్రిక చోరీకి గురైంది. పంపుమోటార్ల విడిభాగాలు పత్తా లేకుండా పోగా ఉన్న ఇనుపపైపుల సామగ్రి తుప్పు పట్టింది. జటప్రోల్ తీరాన గోప్లాపూర్ ఎత్తిపోతల పథకంలో పంపుమోటార్ల భాగాలు తుప్పుపట్టాయి. కొంత సామగ్రి మాయమైంది. ఇక బోరబండ ఎత్తిపోతల పథకంలో ఇనుపపైపులు తుప్పుపట్టి దెబ్బతిన్నాయి. మాధవస్వామినగర్, గోప్లాపూర్ ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూ. 4 కోట్లు ఖర్చు పెట్టారు.