Vegetable crop successful: వనపర్తి జిల్లా నందిమల్ల గడ్డకు చెందిన రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా కూరగాయలు సాగు చేస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు. ఒక్కో రైతు ఐదారు ఎకరాల్లో తీగ జాతి కూరగాయలతో పాటు టమాటా, మిరప, బెండ, వంకాయ లాంటి కాయగూరలను పండిస్తున్నారు. పండించిన పంటను సమీప పట్టణమైన వనపర్తిలో విక్రయిస్తూ.. నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తూ జిల్లా పరిధిలోని రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అంతర పంటలు: గతంలో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను సాగు చేసి నష్టపోయామని రైతులు తెలిపారు. నేడు కూరగాయల సాగు చేస్తూ తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే రకమైన కూరగాయల సాగు చేస్తే రైతుకు సంవత్సరానికి కేవలం లక్షా, రెండు లక్షలు మాత్రమే ఆదాయం ఉంటుందని.. అలా కాకుండా కాకర, బీర, చిక్కుడు, వంగ లాంటి తోటలను ఒకదాని తర్వాత ఒకటి మూడు నెలలకు ఒక పంట చేతికందే విధంగా ప్రణాళిక చేసుకొని సాగు చేస్తే సంవత్సరం పొడవునా ఆదాయం ఉంటుందని రైతులు తెలిపారు.