వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణలో భాగంగా రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసిన చిరు వ్యాపార సముదాయాలను తొలగించారు. పట్టణ మున్సిపాలిటీ తరఫున తాత్కాలిక సముదాయాలను ఏర్పాటు చేసి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు.
పట్టణంలోని పాలిటెక్నిక్, పాన్గల్ చౌరస్తా పనులు ప్రారంభించిన అధికారులు గాంధీ చౌక్, అంబేడ్కర్ చౌరస్తా లాంటి ప్రాంతాలను విస్మరించారని... అక్కడ తాత్కాలిక సముదాయాలను ఏర్పాటు చేసి ఇవ్వాలని కోరుతున్నారు. వ్యాపారం చేసుకుంటే తప్ప పూట గడవదని... 8 నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
బతుకుదెరువు కోల్పోయాం...
20 సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని... కరోనాతో బతుకు కుదేలైందని చిరు వ్యాపారులు ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోడ్ల విస్తరణ పేరుతో సముదాయాలు కోల్పోవడం వల్ల పూటగడవని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చిరు వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సముదాయాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ప్రణాళికలు సిద్ధం...
100 తాత్కాలిక సముదాయాల నిర్మాణాలకు ప్రణాళికలు తయారు చేశామని వనపర్తి మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. లలిత కళాతోరణం రహదారి వెంట ఇప్పటికే నిర్మాణాలు జరుగుతున్నాయని... అతి త్వరలోనే వ్యాపార సముదాయాలను కోల్పోయిన ప్రతి ఒక్కరికి కేటాయిస్తామన్నారు.
ఇదీ చూడండి:సిరిసిల్ల ఆసుపత్రిలో నూతన సదుపాయాలు ప్రారంభించిన కేటీఆర్