వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలోని రైతులంతా వరి, వేరుశనగ లాంటి సాంప్రదాయ పంటల్నే ఎక్కువగా సాగుచేస్తూ ఉంటారు. కానీ ఏళ్లుగా సాంప్రదాయ పంటల సాగు ద్వారా వస్తున్న లాభాలు అంతంత మాత్రమే. అలా కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ఏడాదికి కనీసంగా రూ. 3 నుంచి 4 లక్షల ఆదాయాన్ని ఆర్జించడమే కొత్త పంటల్ని వేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కూరగాయల సాగు (Vegitable Crop)ను ఎంచుకున్నారు. ఇదే విషయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ బాషా దృష్టికి తీసుకువెళ్లగా, వారికి కావాల్సిన సహకారాన్ని అందించాల్సిందిగా ఉద్యానశాఖను ఆదేశించారు.
నవంబర్లో సమావేశం...
ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి సైతం చిన్నమందడి గ్రామాన్ని సందర్శించి రైతులతో గత నవంబర్లో సమావేశమయ్యారు. ఈ మేరకు పెద్దమందడి క్లస్టర్ పరిధిలో 100 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా కూరగాయల సాగు చేపట్టాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ముందుకొచ్చిన 40 మంది రైతులకు సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద 50 శాతం రాయితీపై మల్చింగ్, 90శాతం రాయితీతో బిందు సేద్యం, 80శాతం రాయితీపై మొక్కలు అందించారు.
తొలిదశలో చిన్నమందడి, అల్వాల్, చీకురుచెట్టుతండా, దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 40ఎకరాల్లో రైతులు కూరగాయల సాగు చేపట్టారు. ప్రధానంగా టమాటా, వంకాయ, బెండ, దొండ, మిరప, చిక్కుడు లాంటి పంటల్నివేశారు. ఇన్నేళ్లూ సంప్రదాయ పంటల్ని సాగు చేసిన రైతులు, వాటితో పోల్చితే కూరగాయల సాగులోనూ మంచి లాభాలున్నాయని చెబుతున్నారు.
సాగులో మెళకువలు...
కేవలం రాయితీలు అందించి వదిలి వేయకుండా ఉద్యానశాఖ అధికారులు సాగులో మెళకువళల్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. మొజర్లలోని ఉద్యాన కళాశాల అధ్యాపకులు, శాస్త్రవేత్తలు వారానికోసారి ఒక్కో గ్రామంలో కూరగాయల తోటల్ని సందర్శించి అవసరమైన సలహాలు, సూచనలిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి సాగు ప్రారంభించగా 3 నెలల నుంచి దిగుబడులు చేతికి అందుతున్నాయి. టమాట, వంకాయ, బెండ, దొండ, చిక్కుడు, మిరప పంటల్ని కోసి వనపర్తి జిల్లా కేంద్రంలో టోకు ధరలకు కొందరు విక్రయిస్తున్నారు.
చిల్లర ధరలతో పోల్చితే రూ. 10 తక్కువకే టోకుగా అమ్మేస్తున్నారు. కొంతమంది రైతులు స్వయంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే సోలిపురం, వనపర్తి, బలిజపల్లి లాంటి వారాంతపు సంతలు, మార్కెట్లలో చిల్లర ధరలకు విక్రయిస్తున్నారు. అలారోజుకు అన్నిఖర్చులు పోనూ రోజుకూ కనీసంగా వెయ్యి ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. అంటే నెలకు సుమారు 30వేల వరకూ ఆదాయం పొందుతున్నారు.