గర్భిణీలకు, బాలింతలకు పెద్దన్నయ్య..పౌష్టికాహారం అందిస్తున్న సర్పంచ్ రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గించాలంటే గర్భవతి సమయం నుంచి శిశువు ఆరు నెలల వరకూ మంచి పౌష్టికాహారం అందించాలి. రక్తహీనత, పౌష్టికాహార లోపం వల్లనే మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కేసీఆర్ కిట్ సహా అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అందిస్తోంది. వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం చిన్నమందడిలో మాత్రం గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక కార్యక్రమం అమలవుతోంది. అంగన్‌వాడీ టీచర్లు అందించే ఆహారంతో.... అదనంగా రోజూ అరకిలో కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను, పప్పులను ఉచితంగా అందిస్తున్నారు. సర్పంచ్ సూర్య చంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో యశోద ఫౌండేషన్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏడాది కాలంగా అమలవుతోంది.
ఇంటివద్దకే పౌష్టికాహారం
పౌష్టికాహారం కోసం మహిళలు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వారి ఇంటికే పంపే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం తింటే.. రాత్రి భోజనంలో పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తున్నారు. యశోద ఫౌండేషన్ అందించే ఈ ఆహారాన్ని కేవలం గర్భిణిలు, బాలింతలు మాత్రమే తినాలి. శిశువు జన్మించిన ఆరు నెలల వరకూ ఈ పౌష్టికాహారాన్ని ఉచితంగా అందిస్తారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగడం వల్ల గర్భస్త శిశువులు ఆరోగ్యంగా ఉంటున్నారని లబ్దిదారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తున్నామని సర్పంచ్ సూర్యచంద్రా రెడ్డి తెలిపారు.
గర్భిణులు, బాలింతల కోసం చిన్నమందడిలో చేస్తున్న కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో అమలు చేస్తే.... శిశు మరణాలను తగ్గించే అవకాశం ఉంటుందని అంతా అభిప్రాయపడుతున్నారు.