వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని సరళాసాగర్ సైఫన్ గేట్లు తెరుచుకున్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో ఈ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు సైఫన్లు వాటంతట అవే తెరుచుకుని దిగువకు నీటిని విడుదల చేస్తున్నాయి. రెండు ప్రీమింగ్ సైఫన్లు, 3 వుడ్ సైఫన్లు తెరచుకున్నాయి. ఆసియాలోనే ఆటోమాటిక్ సైఫన్ వ్యవస్థతో నడిచే ఏకైక ప్రాజెక్టు సరళసాగర్. ప్రపంచంలో ఇలాంటిది ఒక్క అమెరికాలోనే ఉంది. సిబ్బంది, యంత్రాలు, గేట్లు అవసరం లేకుండా ప్రాజెక్టు నిండినప్పుడు దానంతట అదే దిగువకు నీరు విడుదల చేసుకోవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. వనపర్తి సంస్థానాధీశుడైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరిట ఈ ప్రాజెక్టును నిర్మింపజేశారు. 15 సెప్టెంబర్ 1949లో అప్పటి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 1959లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోగానే తొలుత ప్రైమింగ్ సైఫన్లు, తర్వాత వుడ్ సైఫన్లు స్వయంచాలితమై దిగువకు నీటిని విడుదల చేస్తాయి.
నీటి విడుదలకు ఎలాంటి మానవసాయం, యంత్ర సహకారం, విద్యుత్ అవసరం లేదు. నీటి మట్టం పెరుగుతున్న కొద్ది ఒకదానికి తర్వాత ఒకటి నాలుగు ప్రైమరీ సైఫన్లు, 17 వుడ్ సైఫన్లు వాటంతట అవే దిగువకు నీటిని విడుదల చేస్తాయి. నీటిమట్టం తగ్గగానే నీటి విడుదల సైతం దానంతట అదే ఆగిపోతుంది. ఇప్పటి వరకూ ఒక్కటి రెండు సార్లు మినహా ఎప్పుడూ సైఫన్ సిస్టం వినియోగం లోకి రాలేదు. 2009లో వరదలు వచ్చినప్పుడు పూర్తిస్థాయిలో పనిచేశాయి. ఎంతటి వరద వచ్చినా వేగంగా దిగువకు నీటిని విడుదల చేయడం సైఫన్ సిస్టం ప్రత్యేకత.