వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో రహదారుల విస్తరణ అమలుకు నోచుకోకపోవడం వల్ల ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యకు పరిష్కారం లభించడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారుల విస్తరణ ప్రక్రియకు 2002లో ప్రతిపాదనలు సిద్ధమై 33 ఫీట్ల మేరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఆక్రమణలు తొలంగించాలని అప్పట్లో ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. వ్యాపారులు తహసీల్దార్ కార్యాలయంలో సమావేశమై తీర్మానాన్ని అంగీకరించారు. ఆర్అండ్ బీ సిబ్బంది ఆక్రమణలపై మార్కింగ్ చేశారు.. పనులు ప్రారంభమయ్యేలోపే 2004 ఎన్నికలు వచ్చాయి. అంతే షరా మామూలే.
నిధులు వచ్చినా వాడుకోలేకపోయారు
రహదారుల విస్తరణ ప్రక్రియతో నిమిత్తం లేకుండా 2016లో ఆర్అండ్బీ శాఖ పట్టణంలో ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండం వల్ల పట్టణ వాసుల మోములో ఆనందం చిగురించింది. ఎంపీడీవో కార్యాలయం నుంచి భాజపా క్యాంపు వైపు ఉన్న పాత రహదారులను అభివృద్ధి చేశారు. తమకు రోడ్ల గోడు తీరుతుందని భావించిన స్థానికులకు మళ్లీ గడ్డుకాలం ఎదురైంది. సాగర్ నుంచి గాంధీచౌక్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న ప్రధాన కాలువ పనులు సకాలంలో పూర్తి చేయలేదన్న కారణంతో నిధులు వెనక్కి మళ్లాయి. ఫలితంగా మళ్లీ రహదారుల విస్తరణ ఆగిపోయింది.