Revanth Reddy Speech at Wanaparthy Public Meeting : బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి.. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులపాలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల(Polytechnic College) మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయ భేరి సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న రేవంత్.. రైతన్నకు భరోసా కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో హస్తం పార్టీకి సంపూర్ణ మద్దతు పలకాలని కోరారు.
Revanth Reddy Comments on KCR :బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించిన రేవంత్... పదేళ్ల కేసీఆర్ పాలనలో నిధులన్నీ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే మళ్లించారని వెనుబడిన పాలమూరును(Palamuru) మరింత వెనకకు నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆగర్భ శ్రీమంతులుగా కల్వకుంట్ల కుటుంబ మాత్రమే బాగుపడిందని.. యావత్తు ప్రజానికం అప్పుల ఊబిలోకి జారుకుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
విపక్ష పార్టీల సుడిగాలి పర్యటనలు - కుటుంబ పాలనకు అంతం పలకాలంటూ ప్రచారాలు
ఈ రాష్ట్రంలో రూ. లక్ష కోట్లు దోపిడీ చేసి.. లక్షలాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు కేసీఆర్, కేటీఆర్ వారి పార్టీలో ఉన్నవాళ్ల కలలు మాత్రమే నెరవేరాయి. ఈ పది సంవత్సరాల్లో ఎవరైనా బాగుపడ్డారంటే.. ఎవరైనా ఆగర్భ శ్రీమంతుడు అయ్యారంటే.. ఎవరికైనా ఫామ్ హౌస్‌లు వచ్చాయంటే.. ఎవరైనా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారంటే అది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే.-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Telangana Assembly Election 2023 : ఇక అభివృద్ధి కోసం ఎవరి దగ్గరో చేతులు చాచడం కాదని.. మీ అభివృద్ధి.. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని అది మీరు వేసే ఓటు నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. వనపర్తికి పరిశ్రమలు రావాలంటే ఇక్కడ కాంగ్రెస్(Congress Party) గెలవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని.. కేసీఆర్ కుటుంబం.. పార్టీ నేతల కలలు మాత్రమే నెరవేరాయని విమర్శించారు.