Puligutta Mining Lease controversy : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకులోని పులిగుట్ట.. వివాదాస్పదానికి అడ్డాగా మారింది. అక్కడ తెల్ల రాయి కోసం జరగనున్న మైనింగ్‌పై స్థానికులు భగ్గుమంటున్నారు. ఇటీవల గ్రామస్తులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. మైనింగ్ కోసం లీజుకిచ్చిన గుట్టకు ఆనుకునే రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకం రెండోదశ కింద చేపట్టిన ఏనుకుంట బాలన్సింగ్ రిజర్వాయర్ ఉంది. గుట్టను ఆనుకొని నీళ్లు నిల్వ చేసేలా జలాశయం నిర్మించారు.
ప్రస్తుతం గుట్టపై మైనింగ్ చేపడితే జలాశయంలోని నీటి నిల్వకు ఇబ్బంది ఎదురవుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మైనింగ్ చేపట్టే పులిగుట్టకు ఆనుకునే మోడల్ స్కూల్, కస్తూరీబా పాఠశాల, సబ్‌స్టేషన్ నిర్మించారు. ప్రస్తుతం మైనింగ్‌కి అనుమతిస్తే కాలుష్యంతో పాటు ప్రభుత్వ ఆస్తులు దెబ్బతింటాయని.. స్థానికులు చెబుతున్నారు.
సర్వేనెంబర్ 20లో 32.12 ఎకరాల్లో 2002 నుంచి 2022 మార్చి వరకు పలుగురాళ్ల కోసం తవ్వకాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం 20ఏళ్లపాటు.. ఓ వ్యక్తికి లీజుకిచ్చింది. కానీ 20 ఏళ్లుగా అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగలేదు. గడువు ముగియండతో లీజును.. మరో 20 ఏళ్లపాటు పునరుద్దరించుకునేందుకు లీజుదారు వారసులు గనులశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. స్పందించిన అధికారులు అన్ని ధ్రువపత్రాల్ని 6నెలలలోపు సమర్పించాలని.. గత ఆగస్టులో ఆదేశించింది.
Mining At Puligutta In Vanaparthi: ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. ఈ మేరకు గనుల శాఖ లీజుదారునికి నోటీసులు జారీ చేశారు. 20 ఏళ్లలో అక్కడ జలాశయం సహా ప్రభుత్వ ఆస్తులు వెలిశాయి. ఈ తరుణంలో పులిగుట్టపై ప్రస్తుతం మైనింగ్‌కి అనుమతి ఇవ్వొద్దని గ్రామస్తులు అధికారుల్ని కోరుతున్నారు. తవ్వకాలు చేపడితే ఏర్పడే కాలుష్యం వల్ల జలాశయంలో మత్ససంపదకు.. నష్టం వాటిల్లుతోందని మత్సకారులు ఆందోళన చెందుతున్నారు.