వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. వరి సన్నరకం పంటకు కేంద్రం కేటాయించిన ధర రూ.1,860కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు కలిపి క్వింటాలుకు మొత్తం 2,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.
క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలని రహదారిపై రాస్తారోకో - మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తాజా వార్తలు
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ధరకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలని తెదేపా ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ప్రభుత్వం తక్షణమే పంటను కొనుగోలు చేయాలని దయాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు ఒక ఎకరం పంట పండించడానికే సుమారు 28 వేల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని.. అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకుని అండగా నిలబడాలని కోరారు. రహదారిపై ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని రాస్తారోకోను విరమింపజేశారు. ధర్నాలో ఆత్మకూరు పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం