జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో మతం, కులం ప్రస్తావన తొలగించాలని కోరుతూ.. మతాంతర వివాహం చేసుకున్న ఓ జంట హైకోర్టును ఆశ్రయించింది. హైదరాబాద్కు చెందిన రూప, డేవిడ్ మతాంతర వివాహం చేసుకున్నారు. వారికి గతేడాది మార్చి 23న మగ శిశువు జన్మించాడు. తమ కుమారుడికి జనన ధ్రువీకరణ పత్రం కోసం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో మతం అనే కాలమ్ నింపితేనే జనన ధ్రువీకరణ పత్రం ఇస్తామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. తమకు మతంపై విశ్వాసం లేదని.. మతాంతర వివాహం చేసుకున్నందున.. తమకు ఏ మతంతో సంబంధం లేని ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని కోరారు.
కుల, మత ప్రస్తావన లేని..
మున్సిపాలిటీ అధికారులు నిరాకరించగా.. జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది గడిచినప్పటికీ.. ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ ఆ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడికి జీవితంలో ఏ సందర్భంలోనూ.. కుల, మత ప్రస్తావన లేని విధంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చి.. అలాంటి ప్రస్తావన అవసరం లేకుండా జారీ చేసేలా విధివిధానాలు రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.