సర్పంచుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వనపర్తి జిల్లా నాగవరంలో నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచులు బాగా కష్టపడి పని చేయడం వల్లనే రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు.
గ్రామాలలో పల్లె ప్రగతి ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం వల్ల రాష్ట్రం అనేక అవార్డులను సొంతం చేసుకుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా పల్లె ప్రకృతి వనాలకు,చెత్త వేరు చేసే షెడ్డులకు, వైకుంఠధామాలకు నీటి సౌకర్యం కల్పించాలని మంత్రి ఆదేశించారు.
ప్రతి 3 నెలలకు గ్రామాలలో గ్రామ సభలు తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ తాగునీటిపై సర్పంచులు గ్రామాలలో అవగాహన కల్పించాలని కోరారు.
ఆ వెసులుబాటు చట్టంలో ఉంది:
అభివృద్ధికి సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచ్ సంతకం చేయకపోతే వారం రోజుల తర్వాత జిల్లా కలెక్టర్కు తెలియపరచి... సర్పంచ్ సూచించిన వార్డు సభ్యునికి అధికారం ఇచ్చే వెసులుబాటు పంచాయతీరాజ్ చట్టంలో ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సర్పంచులు మూలస్తంభాలు:
రాజకీయ వ్యవస్థకు సర్పంచులు మూలస్తంభాలాంటివారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా సమయంలో సైతం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేశామని గుర్తు చేశారు. సర్పంచుల సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
ఈ సమ్మేళనానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ ఛైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీఎస్టీని మార్చేస్తాం'