తెలంగాణ

telangana

ETV Bharat / state

PRAGATHI: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పల్లె,పట్టణప్రగతి, హరితహారం - telangana varthalu

పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు ఉత్సాహంగా సాగింది. గ్రామ, వార్డు సభలు నిర్వహించి కార్యచరణకు శ్రీకారం చుట్టారు. ప్రజాసమస్యల పరిష్కారం అజెండాగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు హాజరై.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటారు.

PRAGATHI:  రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పల్లె,పట్టణప్రగతి, హరితహారం
PRAGATHI: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పల్లె,పట్టణప్రగతి, హరితహారం

By

Published : Jul 2, 2021, 5:10 AM IST

గ్రామాలు, పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రారంభించిన...పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా కడుకుంట్లలో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీఒక్కరూ ప్రభుత్వ పథకాలను హక్కుగా తీసుకోవడమే కాక పంచాయతీకి పన్నులను బాధ్యతగా చెల్లించాలని సూచించారు. అనంతరం మొక్కలు నాటిన నిరంజన్ రెడ్డి.. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానికులకు తడి,పొడి చెత్త బుట్టలను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ వెంకటేశ్‌ నేత పంపిణీ చేశారు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. బస్తీల్లో నెలకొన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు.

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు..

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్‌లో పల్లెప్రగతి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఓఎస్డీ స్మితా సబర్వాల్‌ పాల్గొన్నారు. పల్లె ప్రగతి ద్వారా ఆదర్శ గ్రామాలకు పునాది పడిందని తెలిపారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి అక్కడ మొక్కలు నాటారు. పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేక ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం 12, 13 డివిజన్లలో ఎమ్మెల్యే నరేందర్ పర్యటించారు. ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించేందుకు పట్టణ ప్రగతి దోహదపడుతుందని తెలిపారు. అనంతరం మేయర్‌ గుండుసుధారాణితో కలిసి మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్​లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ హాజరై పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా మురికికాల్వలు పూడిక తీయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కామారెడ్డి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ 33వ వార్డులో కార్యక్రమంలో పాల్గొని ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మొక్కలు నాటాలి..

ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పల్లెప్రగతిలో పాల్గొన్నారు. తొలుత వనదేవతలను దర్శించుకొని అనంతరం గ్రామసభలో ప్రజా విజ్ఞప్తులు స్వీకరించారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో విరివిగా మొక్కలు నాటారు. ఛైర్మన్‌ బాలమల్లుతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఇల్లందులో హరితహారం పాదయాత్రలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ పాల్గొన్నారు.

ప్రతి ఇంటా ఆరు మొక్కలు నాటి వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని కోరారు. మంచిగా మొక్కలు పెంచినవారికి మున్సిపాలిటీ తరఫున నగదు నజరానా ఇప్పిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.

ఇదీ చదవండి: PATTANA PRAGATHI: పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రారంభమైన పట్టణ ప్రగతి

ABOUT THE AUTHOR

...view details